యుద్ధం ఎఫెక్ట్తో ఇండియాలో ధరలు పెరిగే అవకాశం
ఢిల్లీ, 04 మార్చి (హి.స.) ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతున్నది. దాదాపు 88 శాతం చమురును దిగుమతిని చేసుకునే భారత్కు ఇది మరింత తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నది. పశ్చిమాసియాలో చీమ చిటు
prices-in-india-likely-to-rise-due-to-iran-usa-war-effec


ఢిల్లీ, 04 మార్చి (హి.స.)

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతున్నది. దాదాపు 88 శాతం చమురును దిగుమతిని చేసుకునే భారత్కు ఇది మరింత తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నది. పశ్చిమాసియాలో చీమ చిటుక్కుమన్నా మన చమురు దిగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వెలువడుతాయి. అలాంటిది.. ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్పై దాడి చేయడం.. ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైనే దాడులకు దిగడం.. భారత్తోపాటు ప్రపంచ దేశాల చమురు అవసరాలనూ ముప్పులో పడేస్తున్నాయి. ముఖ్యంగా భారత మొత్తం చమురు దిగుమతుల్లో సగం పశ్చిమాసియా నుంచే.. అదీ హోర్ముజ్ జలసంధి గుండానే మనకు వస్తాయి. తాజాగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మూసేస్తున్నట్టు ప్రకటించడంతో భారత్కు చమురు కొరత ఏర్పడుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయన్న ఆందోళనలు వస్తు్న్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ చమురు మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 10 శాతం పెరిగి 80 డాలర్లకు చేరింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటన వచ్చిందో.. రాలేదో.. మన దేశానికి చమురుతో వస్తు్న్న 37 భారీ నౌకలు అక్కడే స్ట్రక్ అయినట్టు తెలిసింది.

మన దేశం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రతి ఉత్పత్తి, ప్రతి సర్వీసుపై ప్రభావం పడుతుంది. హోర్ముజ్ జలసంధి మూసేస్తే.. మార్కెట్లో చమురు పై ఒక డాలర్ పెరిగినా.. మనం ఇతర సుదూర మార్గాల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తే.. మనకు రెట్టింపు ధర అవుతుంది. అందుకే హోర్ముజ్ జలసంధి కీలకం. 2024 చివరి గణాంకాలు చూస్తే.. ఈ జలసంధి నుంచి ప్రతిరోజు మనకు 2.7 మిలియన్ బ్యారెళ్లు ప్రతి రోజుకు దిగుమతి అవుతుండేవి. అంటే మన దేశానికి ప్రతిరోజు అవసరమయ్యే(సుమారు 6 మిలియన్ బ్యారెళ్లు) చమురులో సగం ఇక్కడి నుంచే వస్తున్నట్టు. భారత్ 88 శాతం చమురునే కాదు.. దాదాపు 50 శాతం సహజ వాయువునూ దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపుగా మొత్తం ఎల్పీజీ ఈ జలసంధి గుండానే మనకు వస్తున్నది. 60 శాతం ఎల్ఎన్జీ హోర్ముజ్ ద్వారానే(అంతర్జాతీయంగా 20 శాతం చమురు ఈ సంధి గుండానే రవాణా అవుతుంది) మనకు చేరుతున్నది. ఖతర్ నుంచి అత్యధికంగా ఎల్ఎన్జీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. నిత్యం అత్యధికంగా మనకు ఈ జలసంధి గుండానే వస్తాయి.

అందుకే అటు జలసంధి మూసేసే ప్రకటన రాగానే.. అప్పటికే 37 భారత జెండాలతో వస్తు్న్న నౌకలు అక్కడ నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. అందుకే భారత్ ఇది వరకే ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ మొదలుపెట్టిందని, ధరాఘాతాన్ని ఎదుర్కోవడానికి చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande