
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)
రేషన్ కార్డు లబ్దిదారులకు
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతినెలా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్బయ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌరసరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్దిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారుగా 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోటా కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం అందించాలి. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే మొత్తంగా 72 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
జూన్ 2026 వరకు ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించాలి: కేంద్రం...
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన ఆహార ధాన్యాలను జూన్ 2026 వరకు ముందుగానే సేకరించి, లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాబోయే ఆహార ధాన్యాల సేకరణ సీజన్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొనే లాజిస్టికల్, నిల్వ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహార ప్రజాపంపిణీ శాఖ ఈ మేరకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు