
అమరావతి, 07 మార్చి (హి.స.)
ఈ సంవత్సరం వర్షాలతో పాటు, చలి, ఎండలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా వర్షాలు, చలి తీవ్రత అధికంగా కనిపించింది. తాజాగా ఎండలు సైతం మార్చి మొదటి వారంలోనే చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యప్రతాపం చూపిస్తుండటంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరగనుందని, దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈసారి వడగాల్పుల (Heat Waves) తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎండల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV