
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి సీఎం రేవంత్తో పాలు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.
తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వేం నరేందర్రెడ్డి చెప్పారు.
స్తుతం సిటింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ ఎంపిక చేయగా ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్ వచ్చారు. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు, సంప్రదింపుల తర్వాత వేం నరేందర్రెడ్డి పేరును ఖరారు చేశారు. ఈయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థిని రంగంలోకి దింపితే రెండో స్థానానికి పోటీ అనివార్యమవుతుంది. ఆ పార్టీ పోటీలో లేకుంటే రెండు స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకుంటుంది. మొదటి స్థానానికి అభిషేక్ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్కు లేదు. ఎంఐంఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్