
అమరావతి,, 05 మార్చి (హి.స.)రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. నెలరోజుల్లోనే ఈ విషయంపై సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ బడ్జెట్ రూ.15,485కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.11,217కోట్లు, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు రూ.713కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైనా దృష్టి పెడతామని తెలిపారు. మొక్కలకు జియో ట్యాగింగ్ విషయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంపై మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో మూడు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు సకాలంలో ఇచ్చామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్