
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కీలక ప్రకటన చేశారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన రోజును గుర్తుచేస్తూ.. ఇప్పుడు పనులను పూర్తి చేసి నీటిని అందించే అవకాశం తనకే వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
1996 మార్చి 5.... ఆ రోజు తనకు ఇంకా గుర్తుందన్నారు సీఎం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే.. వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగు వేశామని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో.. జలాశయం ఫోర్షోర్ నుంచి 43.50 టీఎంసీల నీటిని వినియోగించుకునే ఆలోచనతో 30 ఏళ్ల క్రితం ఇదే రోజున (1996 మార్చి 5న) ముఖ్యమంత్రిగా తాను వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసినట్లు తెలిపారు.
అనేక కారణాలతో తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశామన్నారు సీఎం. ప్రాజెక్ట్ కోసం రూ.1,414 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం పేరుతో ప్రజలను మోసం చేసి నవ్వులపాలు అయ్యిందని సీఎం అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్