
వరంగల్, 05 మార్చి (హి.స.)
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు
న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ని ఆయన సందర్శించారు. పోలీస్ కమిషనర్ కు ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రావు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ఆయా గ్రామాల్లోకి ప్రజల జీవన శైలి, పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా జరిగే నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్లు, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణ పై స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్ కు సంబందించి రికార్డులను సీపీ పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించకుండా విధులు నిర్వహించాలని, ముఖ్యంగా పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని సీపీ తెలియజేశారు. పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తో పాటు, ఎస్ ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..