
అమరావతి, 05 మార్చి (హి.స.)
ఎండాకాలం వచ్చేసింది. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో దుప్పటి చాటున ఉన్న జనాలు.. ఇప్పుడు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. విపరీతమైన వేడి వస్తున్న నేపథ్యంలో ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు. క్రమ క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రేపటి నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత మరింత పెరుగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటిపోతాయని స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజే కర్నూలులో అత్యధికంగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. రేపటి నుంచి మరింత ఎక్కువ ఉండే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట లాంటి జిల్లాలలో 40 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇకపై మధ్యాహ్నం ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా సూచనలు చేసింది. అతి త్వరలోనే వడగాల్పులు కూడా ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV