
హైదరాబాద్, 06 మార్చి (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డికి కొత్త రాజకీయ సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ముఖ్యమంత్రికి వెన్నంటి ఉండే నాయకుడెవరు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తున్నది. రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసే ముందు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలోకి కొత్తగా వచ్చే నాయకుడు ఎవరు? సీఎం రేవంత్కు ఆయన మాదిరి సన్నిహితంగా ఉండే లీడర్ ఎవరైనా ఉన్నారా? అని చర్చ జరుగుతున్నది. మళ్లీ వేం నరేందర్ రెడ్డినే తన సలహాదారుగా ముఖ్యమంత్రి నియమించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 'ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్' అనే సమస్య రాకుండా కొత్తగా మరో పోస్టును క్రియేట్ చేసి అపాయింట్ చేసుకునే వెసులుబాటు ఉందని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
సీఎంకు తోడుగా ఉండేదెవరు?
కష్టసుఖాల్లో తోడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ ఎంపీగా నియమించడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. అందుకోసం ఏఐసీసీ నేతలను సైతం ఒప్పించారు. ఇంతకాలం వేం నరేందర్ రాజకీయ సలహాదారు హోదాలో ఎమ్మెల్యేలు, లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి సాధకబాధకాలు వినేవారు. సమయం, సందర్భం చూసుకుని సీఎం రేవంత్ రెడ్డికి వివరించేవారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించే చాన్స్ లేదని చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఎవరూ లేకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే 2009 నుంచి ఇరువురు కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఎప్పుడు ఏ విషయాన్ని సీఎం వద్ద ప్రస్తావించాలో వేం నరేందర్ రెడ్డికి బాగా తెలుసు. ఆయనకు ఏం టాస్క్ ఇవ్వాలో ముఖ్యమంత్రికి తెలుసు. వారిది సక్సెస్ జోడి. 'వేం ప్లేస్ను మరొకరు భర్తీ చేయలేరు' అని ఓ సీనియర్ నేత వివరించారు.
ఉమ్మడి ఏపీలో 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు సన్నిహితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావును ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అటు ఎంపీగా, ఇటు ప్రభుత్వ సలహాదారుడిగా ఒక వ్యక్తి ఒకేసారి రెండు లాభదాయక పదవుల్లో ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని కేవీపీ సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు