విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాం: సీఎం రేవంత్రెడ్డి
మిత్రుడి కోసం చివరి ఊపిరి వరకు కర్ణుడు నిలబడ్డాడని, నేను కూడా మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Revanth reddy


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో సీఎంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. చిత్తశుద్ధితో ప్రజల ముందుకు వచ్చాం కాబట్టే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

‘‘ మీ లక్ష్యాన్ని సాధించడానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి దిల్లీ దాకా పోరాడారు. ప్రజాజీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీ సమస్యను చూస్తూనే ఉన్నాను. మీ న్యాయమైన హక్కును సాధించడానికి మీతోపాటు నడిచా. కులాల వర్గీకరణకు సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. అన్ని సమస్యలకు వర్గీకరణ పరిష్కారం కాకపోవచ్చు. మీ సమస్యలు పరిష్కరించేటప్పుడు అడ్డుకునేవారిని మీరే నిలువరించాలి. బాధ్యతతో వ్యవహరిస్తే మీ జాతికి న్యాయం జరుగుతుంది.

ప్రగతి ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మీరు పన్నులు సక్రమంగా వసూలు చేసి ఖజానా నింపితే పేదలకు మేలు జరుగుతుంది. పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. చదువు ఒక్కటే ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి. విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాం. ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేసేది మీరే. భవిష్యత్లో మీ హక్కులకు చట్టబద్ధత కల్పిస్తాం. గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేప పిల్లలు ఇచ్చింది. కానీ, చెప్పులు కుట్టే ఈ జాతి ప్రజలు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి’’ అని రేవంత్రెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande