
హైదరాబాద్, 06 మార్చి (హి.స.)రాష్ట్రంలో 33 ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.లక్షకు పైగా.. రెండు కళాశాలలకు రూ.లక్షగా ఫీజును నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం 160 ఇంజినీరింగ్ కాలేజీలకు కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం జీవో(6) జారీ చేసింది. ఈ రుసుములు 2025-28 బ్లాక్ పీరియడ్కు వర్తిస్తాయి. గత బ్లాక్ పీరియడ్లో ఫీజు రూ.లక్ష దాటిన కళాశాలల సంఖ్య 33 ఉండగా.. ఈసారీ అంతే ఉండటం విశేషం. రూ.లక్ష ఉన్న కళాశాలల సంఖ్య అప్పట్లో 7 కాగా ఇప్పుడు 2కి తగ్గింది.
అత్యధికంగా సీబీఐటీకి ఫీజు రూ.1.83 లక్షలుగా నిర్ణయించారు. రూ.1.75 లక్షలతో వాసవి కళాశాల రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) 19 కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించడంతోపాటు.. 70 కళాశాలలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీచేసింది. కనీస ఫీజు రూ.45 వేలు ఉండగా.. 21 కళాశాలలకు ఆ రుసుమును ఖరారు చేశారు.
తాజాగా నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి. మూడేళ్ల బ్లాక్ పీరియడ్ అంటే.. 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఫస్టియర్లో చేరినవారికి ఈ ఫీజులు వర్తిస్తాయి. ఆ విద్యార్థులు నాలుగేళ్లపాటు అవే రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
ఈసారి 19 కళాశాలలకు ఫీజు తగ్గించారు. అంటే గత విద్యా సంవత్సరం (2024-25) వరకు ఉన్న ఫీజులో టీఏఎఫ్ఆర్సీ కోత పెట్టింది. గత ఆగస్టులో ఎప్సెట్ కౌన్సెలింగ్ సందర్భంగా విద్యార్థుల నుంచి పాత ఫీజులనే వసూలు చేశారు. ప్రభుత్వం కొత్త ఫీజులను నిర్ణయించిన తర్వాత ఒకవేళ తగ్గితే ఆ వ్యత్యాసాన్ని వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అప్పట్లో పేర్కొంది. ఈసారి 19 కళాశాలల్లో ఫీజు తగ్గడంతో అక్కడ.. సొంతంగా ఫీజు చెల్లించినవారికి ఆయా కాలేజీలు ఆ వ్యత్యాసం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
సీబీఐటీ (1.83 లక్షలు), వాసవి (1.75 లక్షలు), ఎంజీఐటీ (1.67 లక్షలు), సీవీఆర్ (1.63 లక్షలు), నారాయణమ్మ (1.62 లక్షలు), గోకరాజు (1,60,500), వీఎన్ఆర్ (1,59,600), బీవీఆర్ఐటీ (1,46,600), కిట్స్ (1,46,200), ఎంవీఎస్ఆర్ (1,43,800), బీవీఆర్ఐటీ మహిళలు (1,43,500), ఎస్ఆర్ (1.41 లక్షలు), వర్ధమాన్ (1.40 లక్షలు), శ్రీదేవి (1.37 లక్షలు), శ్రీనిధి (1.33 లక్షలు), కేఎంఐటీ (1,29,200), గురునానక్ టెక్నికల్ (1.29 లక్షలు), ముఫకంజా (1.25 లక్షలు), విజ్ఞాన్ (1.23 లక్షలు), గీతాంజలి (1.21 లక్షలు), శ్రీఇందు (1.15 లక్షలు), ఏస్ (1.10 లక్షలు), జేబీఐటీ (1.10 లక్షలు) అను బోస్ (1,08,100), శ్రేయాస్ (1.06 లక్షలు), వాగ్దేవి (1.05 లక్షలు), హితమ్ (1,04,900), విజ్ఞాన్స్ మహిళలు (1,04,400), వీబీఐటీ (1,03,200), టీకేఆర్ (1,02,900), కేజీ రెడ్డి (1,02,900), శ్రీదత్త (1,01,100), లార్డ్స్ (1,00,100)
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్