
భీమవరం, 06 మార్చి (హి.స.) రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలు మార్చేలా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు ఆర్సెలార్ మిత్తల్ అండ్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో రూ.1.50 లక్షల కోట్ల అంచనాతో భారీ ప్లాంటు నిర్మాణానికి భూమిపూజ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్లాంటు అని, తొలిదశలో రూ.80 వేల కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేసి, ఏటా 8.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలోనే సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ