క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం
క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
Court


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పై విధంగా ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అర్ధంతరంగా నిలిచిపోయింది.

ఇక బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. ఇటీవల బెయిల్ మంజూరు అయింది. అనంతరం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కేతనపల్లిలోని తన నివాసంలో బాల్క సుమన్ విలేకర్లతో మాట్లాడుతూ.. స్థానిక ఎంపీ వంశీ కృష్ణ, ఎమ్మెల్యే వివేక్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను జైల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ పోలీసులపై ఆయన మండిపడ్డారు.

ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవుల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వేళ.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande