
హైదరాబాద్, 06 మార్చి (హి.స.)రాజేంద్రనగర్ బుద్వేల్లో 1991-96 మధ్య న్యూగ్రీన్సిటీ హుడా లేఅవుట్ వచ్చింది. పట్టాదారుల నుంచి జీపీఏ హక్కులు పొంది దాదాపు ఆరెకరాలలో అబ్దుల్అలీ, ఫతేఅలీ వెంచర్ వేశారు. 1997లో జీపీఏ హోల్డర్ల నుంచి ప్రకాశ్చంద్రాణి, జ్యోతిచంద్రాణి రెండు ప్లాట్లను కొన్నారు. కడపకు చెందిన సౌభాగ్యవల్లి ఆ రెండు ప్లాట్లను 2005లో కొని పొజిషన్ తీసుకున్నారు. అయితే 1995లో పట్టాదారులు.. అబ్దుల్అలీ, ఫతేఅలీలకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా జీపీఏను రద్దు చేశారు. ప్లాట్లు అధీనంలో లేకపోయినా సరే పట్టాదారులు 2000లో మోహన్రెడ్డి, జైహింద్రెడ్డి, అనసూయలకు రిజిస్ట్రేషన్ చేశారు. అనసూయ 2018లో నారాయణరెడ్డి అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారు. దాని ఆధారంగా హెడ్కానిస్టేబుల్ భాస్కర్రావు ఆ ప్లాట్లకు తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేయించడంతో వివాదాలు తలెత్తాయి. ఇలా డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సౌభాగ్యవల్లి ఫిర్యాదు చేయడంతో రాజేంద్రనగర్ పోలీసులు గత నెల 28న నారాయణరెడ్డి, అనసూయ, భాస్కర్రావుపై కేసు నమోదు చేశారు. సాగుతున్న డబుల్ రిజిస్ట్రేషన్ల దందాకు ఇదొక ఉదాహరణ.
రాజధాని శివార్లలో రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భూముల విలువ సాధారణంగానే ఉండేది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం అప్పుడప్పుడే ఊపందుకోవడంతో పలు స్థిరాస్తి సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో హుడా లేఅవుట్లతో వెంచర్లు వేశాయి. అప్పట్లో భూములకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో చాలా వెంచర్లలో పక్కాగా సర్వే చేసి హద్దులు నిర్ణయించలేదు. ఇటీవలికాలంలో భూములకు విలువ బాగా పెరగడంతో అప్పటి హద్దుల విషయంలో తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. పలువురు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి విలువైన స్థలాలపై కన్నేస్తున్నారు. ఒకే స్థలానికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. కొన్నిచోట్ల వెంచర్లలో ప్లాట్లు ఖాళీగా ఉన్నా.. కొనుగోలుదారులు తమ అధీనంలోకి తీసుకోకపోయినా ముఠాలు వాలిపోతున్నాయి. సర్వే నంబర్లకు బైనంబర్లు సృష్టించి దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నాయి. పలు సందర్భాల్లో రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులను మచ్చిక చేసుకొంటూ వివాదాలు రాజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కష్టార్జితంతో స్థలాలు కొన్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీస్స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక.. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడపలేక అలిసిపోతున్నారు. ఈ పరిణామాల్ని ఆసరాగా చేసుకొంటూ ముఠాలు పేట్రేగిపోతున్నాయి. బాధితులకు ఎంతోకొంత ముట్టజెప్పి విలువైన స్థలాలను హస్తగతం చేసుకుంటున్నాయి. కొన్ని ముఠాలు మరో అడుగు ముందుకేశాయి. విలువైన స్థలాలు వేరొకరి అధీనంలో ఉన్నా సరే వదలడంలేదు. డబుల్ రిజిస్ట్రేషన్లతో న్యాయవివాదాలను సృష్టించి అసలైన యజమానులను ఇరుకున పెడుతున్నాయి. ఆ తప్పుడు డాక్యుమెంట్లతో తొలుత పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. పోలీసులు సహకరిస్తే ఇక అసలైన యజమానులపై బెదిరింపులకు అడ్డూ..అదుపు లేకుండాపోతోంది.
1996 వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో విక్రేతలు, కొనుగోలుదారుల ఫొటోలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని కుయుక్తులు పన్నుతున్నాయి. అసలు యజమానుల సంతకాలు ఫోర్జరీ చేయడం ద్వారా గతంలోనే తాము స్థలాలను కొన్నట్లు పత్రాలను సృష్టిస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేస్తున్నాయి. అలాంటి వివాదాలు ఏళ్ల తరబడి కొలిక్కిరావని... దాంతో బాధితులే తమ దారికి వస్తారనే ధీమాతో ముఠాలు చెలరేగిపోతున్నాయి. బాధితులు పట్టుదలగా ప్రయత్నిస్తే తప్ప ముఠాల మోసాలపై ఠాణాల్లో కేసులు నమోదు కావడం లేదు. కొంతకాలం క్రితం మేడిపల్లి, అల్వాల్ ఠాణాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇలాంటి వివాదాల్లోనే ఇబ్రహీంపట్నంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్