
హైదరాబాద్, 06 మార్చి (హి.స.)
మహిళలు తమ కాళ్ళ మీద తాము
నిలబడాలని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాసాబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్ పలు వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన అత్యాధునిక గ్లాస్ లైబ్రరీ,1500 స్థలంలో గ్రంథాలయం, మహిళా శక్తి క్యాంటీన్ మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 99 రోజుల పాటు సాగే ఈ ప్రగతి ప్రణాళిక గ్రామాలు, వార్డుల నుంచి రాజధాని వరకు విస్తరిస్తుందని పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనీ, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవలం లబ్ధిదారులుగానే కాకుండా, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మహిళలను మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు.
అంతే కాకుండా ఇంట్లో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఈ- వేస్ట్ సెంటర్లకు ఇచ్చి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. లైబ్రరీ కోసం పుస్తకాలను విరాళంగా ఇచ్చేందుకు ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెట్విన్ ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ మరియు ఇతర స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
రుణాల ఈ 99 రోజుల కార్యాచరణలో విద్య, వైద్యం, పర్యావరణం మరియు భద్రత వంటి అంశాలపై మహిళలు చురుగ్గా పాల్గొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మహిళా సంఘాలకు 35 కోట్ల రూపాయల సున్నా వడ్డీ చెక్కును మంత్రి అందజేసి, మహిళా సంఘాలతో ముఖాముఖి అయ్యారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మరియు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..