
అమరావతి, 07 మార్చి (హి.స.) విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే వేడుకల్లో మొదటి రోజు ఉదయం 7 గంటలకు కలశ ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు, అర్చకులు కలిసి కృష్ణా నదికి చేరుకొని, జలం నింపిన కలశాలను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రిపైకి తీసుకొచ్చారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణతో.. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను తలపించేలా పూజలు చేశారు. రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం, మూలమంత్ర హవనంతో.. మొదటిరోజు వేడుకలు ముగించారు.
పవిత్ర జలాలతో నిండిన కలశాల ఊరేగింపులో అర్చకులు, ఈవో వి.కె.శీనా నాయక్, ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ
శనివారం ఉదయం 9.34 గంటల నుంచి రెండో రోజు పూజలు చేపట్టనున్నట్లు దేవస్థాన ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె.శీనానాయక్ తెలిపారు. సాధారణ భక్తుల దర్శనాలు యథావిధిగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతరాలయ దర్శనాలు మాత్రం శని, ఆదివారాల్లో నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ