
, విశాఖపట్నం 07 మార్చి (హి.స.), కూర్మన్నపాలెం, మూడుసార్లు పరీక్షలో విఫలమైనా కుంగిపోకుండా.. పట్టుదలతో ప్రయత్నించి నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ఫలితాల్లో మెరిశారు విశాఖకు చెందిన గుమ్మల శ్వేత. నగరంలోని కణితి అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్వేత సివిల్స్లో 573వ ర్యాంకు సాధించారు. స్వస్థలం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని మేడిచర్ల గ్రామం. తండ్రి రాజబాబు ఉపాధి కోసం నగరానికి వచ్చి.. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారు. తల్లి విజయలక్ష్మి గృహిణి. ‘సమాజానికి నా వంతు సేవ చేసేందుకు సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ విజయం అంత తేలికగా దక్కలేదు. ఐఐటీ హైదరాబాద్లో 2021లో ఇంజినీరింగ్ పూర్తి చేశా. తర్వాత దిల్లీలో ఒక ఏడాది సివిల్స్కు కోచింగ్ తీసుకున్నా. 2022లో మొదటి ప్రయత్నంలో విఫలమయ్యా. 2023లో ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లా. 2024లోనూ నిరాశే ఎదురైంది. దీంతో నాలుగోసారి గట్టిగా ప్రయత్నించా. సివిల్స్కు ఎంపికైన వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో చదివా. దిల్లీలో కోచింగ్ తర్వాత హైదరాబాద్లో అక్క శ్రావణి వద్ద ఉంటూ రోజుకు 10 గంటలపాటు చదివేదాన్ని. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించా’ అని శ్వేత తెలిపారు. తమ కుమార్తెకు ర్యాంకు రావడం ఎంతో గర్వంగా ఉందని శ్వేత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags:Published : 07 Mar 2026 05:05 IST
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ