
అమరావతి, 07 మార్చి (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం)మరో కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లస్కర్ల వేతనాలను పెంచాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే రోజు వారీగా రూ.350 వేతనం అందుకుంటున్న లస్కర్లకు రూ.550లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, లస్కర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని వేతనాలు పెంపు ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ పెంపు వేతనాలు వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు జలవనరుల శాఖలోని సీఏడీఏ కమిషనర్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, సంబంధిత అధికారులు, శాఖలు ఈ మార్పులను వెంటనే అమలు చేయాలని సూచించారు. ఈ వేతన పెంపు ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్లకి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే, వారి జీవన స్థితి మెరుగుపడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల్లో వేతనాలు పెంచే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ