
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విరుధునగర్ జిల్లా, కట్టనార్పట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.
ప్రమాద తీవ్రతకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, విస్ఫోటనానికి దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కట్టనార్పట్టి బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన విస్ఫోటనంలో పలువురు మరణించారన్న వార్త తీవ్ర వేదనకు గురిచేసింది అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi