
కుర్సెయోంగ్, 21 ఏప్రిల్ (హి.స.)పశ్చిమబెంగాల్లో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఉద్వాసన చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. కుర్సెయోంగ్లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, డార్జిలింగ్లో గూర్ఖా కమ్యూనిటీ చిరకాల సమస్యలకు సత్వర పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే గూర్ఖాల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందిస్తాం. గత టీఎంసీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు గూర్ఖాల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యాయి' అని అమిత్షా అన్నారు. గూర్ఖాల చరిత్రను అణిచివేసేందుకు మమతా దీదీ ప్రయత్నించారని, గూర్ఖాలకు జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలికే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ మన కొండప్రాంతాలను రక్తంతో పెయింట్ వేశారని, గూర్ఖాలకు జరిగిన అన్యాయాలకు నరేంద్ర మోదీ నాయకత్వంలో తెరపడుతుందని చెప్పారు.
'గూర్ఖా సోదరులపై వందలాది తప్పుడు కేసులు పెట్టారు. వాటన్నింటినీ జూలై 31వ తేదీలోగా ఉపసంహరిస్తాం. గూర్ఖా ఉద్యమాన్ని వాళ్లు అణిచివేశారు. మేము ఆ కేసులన్నీ ఉపసంహరిస్తాం. ఇక నిరసనలకు తావులేని విధంగా సమస్యలను పరిష్కారిస్తాం' అని అమిత్షా భరోసా ఇచ్చారు.
సందేశ్ఖాలీ వంటి ఘటనలను అమిత్షా ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళలపై నేరాలు పెరిగాయని, బీజేపీ అధికారంలోకి రాగానే ఆ నేరాలకు బాధ్యులైన వారందిరినీ జైళ్లకు పంపిస్తామని అమిత్షా చెప్పారు. కుర్సెయోంగ్, కుల్తి, సల్బోని, ఛాందిపూరూర్ తదితర కీలక ప్రాంతాల్లో అమిత్షా మంగళవారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరుగనుండగా, మే4న ఫలితాలు వెలువడతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్