
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా నేడు అనగా ఏప్రిల్ 21 న సివిల్ సర్వీసెస్ డే
వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో, పౌర సేవలో అధికారుల నిబద్ధత, అంకితభావం అభినందనీయమని ఆమె కొనియాడారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, వినూత్నమైన, పౌర కేంద్రీకృత విధానాలను రూపొందించడంలో అధికారుల కృషి గొప్పదని రాష్ట్రపతి పేర్కొన్నారు. విధానాల రూపకల్పన నుంచి వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం వరకు అధికారులు పోషిస్తున్న పాత్ర కోట్లాది మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆమె ప్రశంసించారు.
భారతదేశం నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతున్న తరుణంలో.. అధికారుల చిత్తశుద్ధి (Integrity), సానుభూతి(Empathy) పౌరులకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో, పౌరుల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచడంలోనూ సివిల్ సర్వెంట్స్ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అధికారులు తమ అత్యున్నత ప్రమాణాలను కొనసాగిస్తూ, మరింత సమతుల్యమైన మరియు ప్రగతిశీల దేశ నిర్మాణానికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. నేడు దేశం 'వికసిత్ భారత్ 2047' లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో, సివిల్ సర్వీసెస్ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..