
ఢిల్లీ, 22 ఏప్రిల్ (హి.స.)
దేవభూమి ఉత్తరాఖండ్లోని పవిత్రమైన శ్రీ కేదార్నాథ్ ధామం (Sri Kedarnath Dham) తలుపులు పూర్తి విధివిధానాలతో భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆలయం తెరుచుకోవడంతో భక్తులు దర్శనానికి భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కేదార్నాథ్ ధామంతో పాటు చార్ధామ్ యాత్ర మన విశ్వాసానికి, ఐక్యతకు సుసంపన్నమైన సంప్రదాయాలకు దివ్య ఉత్సవం వంటిదని ప్రధాని పేర్కొన్నారు. ఈ యాత్రల ద్వారా భారతదేశపు సనాతన సంస్కృతిని దర్శించుకునే గొప్ప అవకాశం కలుగుతుందని ఆయన కొనియాడారు.
ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రారంభం సందర్భంగా, ఉత్తరాఖండ్ వచ్చే భక్తులందరి కోసం తాను ఒక లేఖ ద్వారా తన భావాలను పంచుకున్నట్లు మోడీ తెలిపారు. బాబా కేదార్నాథ్ కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని, భక్తుల యాత్ర సుఖమయంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. నేడు కేదార్నాథ్ ఆలయం వేలాది క్వింటాళ్ల పూలతో అత్యంత సుందరంగా అలంకరించబడింది. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు హర హర మహాదేవ శంభో అంటూ శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV