బెంగాల్ ఎన్నికల్లో హింస..ముర్షిదాబాద్లో టీఎంసీ -ఏయూజేపీ మధ్య రణరంగం
బెంగాల్ ఎన్నికల్లో హింస..ముర్షిదాబాద్లో టీఎంసీ -ఏయూజేపీ మధ్య రణరంగం
Assembly


ముర్షిదాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల

తొలి విడత పోలింగ్ సందర్భంగా ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నౌడా నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AUJP) కార్యకర్తల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి (Stone attack) చేసుకొవడంతో యుద్ధ వాతావరణం కనిపించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు.

ఏయూ జేపీ (AUJP) వ్యవస్థాపకుడు, మాజీ టీఎంసీ నేత హుమాయూన్ కబీర్ ఈ ఘటనపై స్పందిస్తూ టీఎంసీ పై తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ దొంగల పార్టీ.. నౌడా ప్రజలు వారిని తిరస్కరించారు. మా కార్యకర్తలపై పోలీసులు అర్థరాత్రి లాఠీఛార్జ్ చేశారు. దీనిపై విచారణ జరపాలి అని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్ సోఫియుజ్జమాన్ షేక్ స్పందిస్తూ.. హుమాయూన్ కబీర్ 15 కార్లలో సంఘ విద్రోహ శక్తులతో వచ్చి పోలింగ్ ఏజెంట్లను బెదిరించారని, అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

బుధవారం రాత్రి అదే ప్రాంతంలో నాటు బాంబుల దాడి జరగడంతో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొంది. తాజాగా పోలింగ్ సందర్భంగా జరిగిన రాళ్లదాడి భయాందోళనలు పెరిగాయి. తాజా పరిస్థితులపై ఏఎస్పీ మజిద్ ఖాన్ మాట్లాడుతూ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు ఆందోళనకారులను చెల్లాచెదురు చేసి ఓటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande