
నదియా, 23 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల
పోలింగ్ సరళిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లోని నదియా లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ రోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పోలింగ్ శాతం బీజేపీ విజయానికి సంకేతమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎక్కడైతే భారీగా ఓటింగ్ జరిగిందో, అక్కడ బీజేపీ ఘన విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. మే 4వ తేదీన (ఫలితాల రోజు) బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ విజయోత్సవాలు జరుగుతాయని, రోజు మిఠాయిలతో పాటు బెంగాల్ ప్రత్యేక వంటకం 'ఝాల్ మురీ' (Jhal Muri) కూడా పంచుతామని చమత్కరించారు.
ఇటీవల ప్రధాని మోడీ ఒక రోడ్డు పక్కన బండి వద్ద 'ఝాల్ మురీ' తిన్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ఝాల్ మురీ నేను తిన్నాను కానీ, దాని కారం (మంట) మాత్రం టీఎంసీకి తగిలింది అంటూ చురకలు అంటించారు. ఝాల్ మురీ పేరు వింటేనే కొంతమందికి షాక్ తగులుతోందని సందర్భంగా ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
గత 50 ఏళ్లలో హింస అతి తక్కువగా జరిగిన ఎన్నికలు ఇవేనని ప్రధాని ప్రశంసించారు. ఒకప్పుడు బెంగాల్లో ప్రతి వారం ఎవరో ఒకరిని ఉరితీసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే అరాచక పాలన ఉండేదని ఆరోపించారు. బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్య గౌరవాన్ని మళ్ళీ పునరుద్ధరించినందుకు ఎన్నికల కమిషన్ను ఆయన అభినందించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు