పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన
Union


న్యూఢిల్లీ, 23 ఏప్రిల్ (హి.స.)

దేశ వ్యాప్తంగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు పెరగనున్నాయంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా (Social Media)లో వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ, సామాన్యులపై ఇంధన భారాన్ని మోపే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 'పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు' అని అధికారికంగా వెల్లడించింది.

అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, గత నాలుగేళ్లుగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా నియంత్రించిన ఏకైక దేశం భారత్ అని మంత్రిత్వ శాఖ గర్వంగా ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారత ప్రభుత్వం పౌరులపై భారం పడకుండా పన్నుల తగ్గింపు, ఇతర చర్యల ద్వారా ధరలను స్థిరంగా ఉంచగలిగిందని ట్వీట్ చేసింది.

ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇంధన ధరల పెంపు వార్తలు వాహనదారుల్లో ఆందోళన కలిగించాయి. అయితే, కేంద్రం ఇచ్చిన ఈ క్లారిటీతో సామాన్యులకు, రవాణా రంగానికి పెద్ద ఊరట లభించినట్లయింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande