
కలకత్తా, 25 ఏప్రిల్ (హి.స.)
బంగాల్లో జరిగి మొదటి దశ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్న ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. డైమండ్ హార్బర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల విధుల్లో పోలీసుల ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అధికారులపై శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించాలని ఈసీ ఆదేశించింది.
డైమండ్ హార్బర్ ప్రాంతానికి చెందిన అదనపు ఎస్పీ సందీప్ గరాయ్, ఎన్సీడీపీఓ సజల్ మండల్, డైమండ్ హార్బర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ మౌసమ్ చక్రవర్తి, ఫాల్తా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అజయ్ బాగ్, ఉస్తీ పోలీస్ స్టేషన్ అధికారి సుభేచ్ఛా బాగ్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశించింది. అదనపు ఎస్పీ సందీప్ గరాయి ఐపీఎస్ అధికారి కావడంతో, ఆయనపై ప్రత్యేక నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డైమండ్ హార్బర్ ఎస్పీ ఇషానీ పాల్కు కూడా ఈసీ హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల సమయంలో కిందిస్థాయి అధికారుల్లో క్రమశిక్షణ, నిష్పక్షపాతాన్ని నిర్ధరించడంలో విఫలమయ్యారని ఆరోపించింది. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేసి, ఏప్రిల్ 25 ఉదయం 11 గంటలలోపు అమలు నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మరోవైపు, ఏప్రిల్ 23న జరిగిన బంగాల్ తొలిదశ ఎన్నికలు ఎక్కడా రీ- పోలింగ్ అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. గురువారం జరిగిన పోలింగ్ అనంతరం అన్ని పోలింగ్ కేంద్రాల నివేదికలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలలో పోలింగ్ ప్రక్రియ సమగ్రతను ప్రభావితం చేసే ఎలాంటి అవకతవకలు బయటపడలేదని ఈసీ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi