'అనవసరంగా లాగారు'- పుస్తక వివాదంపై నరవణె స్పందన- రాహుల్పై పరోక్ష విమర్శలు
'అనవసరంగా లాగారు'- పుస్తక వివాదంపై నరవణె స్పందన- రాహుల్పై పరోక్ష విమర్శలు
'అనవసరంగా లాగారు'- పుస్తక వివాదంపై నరవణె స్పందన- రాహుల్పై పరోక్ష విమర్శలు


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)

భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ అంశంపై తాజాగా స్పందించిన నరవణ, ప్రచురణకు ముందే తన పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువచ్చి అనవసరంగా వివాదంలోకి లాగారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు.

ఇటీవల ఆయన రచించిన ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్: అన్ ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ పుస్తకం విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణె పలు విషయాలను వెల్లడించారు. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం వివాదం గురించి మాట్లాడిన ఆయన, ఆ అంశం తనకు ముగిసిపోయిన అధ్యాయం అని స్పష్టం చేశారు. నరవణె మాట్లాడుతూ, రక్షణ మంత్రిత్వశాఖ పుస్తకాన్ని పూర్తిగా పరిశీలించే వరకు ప్రచురణను నిలిపివేయాలని ప్రచురణకర్తలకు సూచించింది. ఆ నిర్ణయంతో విషయం అక్కడితో ముగిసిపోయింది. నేను కూడా ముందుకు సాగాను. అయితే ప్రచురితం కాని పుస్తకాన్ని బయటకు తీసుకువచ్చి దానిపై చర్చలు జరపడం, నన్ను కూడా అందులోకి లాగడం సమంజసం కాదు అని పేర్కొన్నారు.

ఈ పుస్తకం నేపథ్యంలో గల్వాన్ ఘర్షణల సమయంలో ప్రభుత్వ వైఖరిపై కొన్ని అంశాలు ప్రస్తావనకు రావడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో ఈ పుస్తకంలోని విషయాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించడం కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రచురణకు రాని పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ నరవణ, తనను అనవసరంగా హైలైట్ చేశారని అన్నారు.

ప్రచురణ కాని పుస్తకాన్ని కోట్ చేస్తూ నన్ను వెలుగులోకి తీసుకురావడం అవసరం లేదు. అది సరైన చర్య కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, పుస్తక రచయితగా నరవణె కొత్త దిశలో ముందుకు సాగుతున్నారు. వివాదం తర్వాత ఆయన రెండు పుస్తకాలు రచించగా, వాటిలో ఒకటి ఇప్పటికే విడుదలైంది. మరో పుస్తకం కూడా త్వరలోనే రానుందని తెలిపారు. తన తాజా పుస్తకం గంభీరమైన అకాడమిక్ గ్రంథం కాకుండా పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉండేలా రాసినట్లు చెప్పారు. ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ పుస్తకంలో భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలకు సంబంధించిన ఆసక్తికర కథనాలు, అపోహలు, చారిత్రక అంశాలను వివరించారు. ముఖ్యంగా జైహింద్ నినాదం మూలాలు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నినాదం స్వాతంత్ర్య సమర కాలం నుంచి ఎలా ప్రారంభమై, తరువాత భారత సాయుధ దళాల్లో ఎలా విస్తరించిందో వివరించారు.

నరవణె తెలిపిన వివరాల ప్రకారం, ప్రారంభంలో వాయుసేనలో జైహింద్ ఉపయోగం మొదలై, తరువాత సైన్యం, నౌకాదళం కూడా దాన్ని స్వీకరించాయి. ప్రస్తుతం మూడు దళాల్లో కూడా సెల్యూట్ చేసే సమయంలో జైహింద్ అనడం ఆనవాయితీగా మారింది. ఈ నినాదానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఎంతో లోతైనదని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా అసోం రెజిమెంట్కు చెందిన సైనికుడు బద్లురామ్ కథను కూడా ఆయన పుస్తకంలో ప్రస్తావించారు. 1944లో కోహిమా యుద్ధంలో బద్లురామ్ మరణించినప్పటికీ, అతనికి కేటాయించిన రేషన్ కొనసాగుతుండటం వల్ల ఆ యూనిట్కు ఆహారం అందుతూ ఉండేదని తెలిపారు. ఈ సంఘటన ఆధారంగా రూపొందిన బద్లురామ్ కా బదన్ అనే పాట ఆ రెజిమెంట్లో ఇప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పారు.

ఇక 1971 యుద్ధ సమయంలో పాకిస్థాన్ చేతికి చిక్కిన పెడోంగి అనే గాడిద కథను కూడా నరవణె వివరించారు. ఆ గాడిద శత్రువుల నుంచి తప్పించుకుని, మైన్స్ మధ్యగా ప్రయాణించి తిరిగి తన యూనిట్కు చేరుకుందని చెప్పారు. దాని విశ్వాసం, ధైర్యానికి గుర్తింపుగా గౌరవప్రదంగా రిటైర్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తానికి ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదం తనకు ముగిసిన అంశమని నరవణె స్పష్టం చేశారు. అయితే ప్రచురణకు ముందే దానిని రాజకీయ చర్చల్లోకి లాగడం తగదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, కొత్త విషయాలను పాఠకులకు అందించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande