
న్యూఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.)
భారతీయ చరిత్రను తన కెమెరా
కంటితో బంధించి, ప్రపంచానికి మన దేశ గొప్పతనాన్ని చాటిచెప్పిన దిగ్గజ ఫోటోగ్రాఫర్ రఘు రాయ్ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ కళా మరియు జర్నలిజం రంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలను తీసిన వ్యక్తిగా రఘు రాయ్కు గుర్తింపు ఉంది. ఆయన తీసిన ఫోటోలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, అవి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. 1984 భోపాల్ గ్యాస్ దురంతం సమయంలో ఆయన తీసిన ఫోటోలు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆ విషాదాన్ని ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఆయన పాత్ర మరవలేనిది. మదర్ థెరిస్సా, ఇందిరా గాంధీ, సత్యజిత్ రే వంటి మహానుభావుల వ్యక్తిత్వాలను తన ఫోటోల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు.
'స్టేట్స్మన్' పత్రికలో ఫోటోగ్రాఫర్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత 'ఇండియా టుడే' మ్యాగజైన్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత 'మాగ్నమ్ ఫోటోస్' (Magnum Photos) ఏజెన్సీకి ఎంపికైన అతికొద్ది మంది భారతీయుల్లో ఆయన ఒకరు. ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డుతో గౌరవించింది. అలాగే ఫోటోగ్రఫీ రంగంలో అత్యున్నతమైన అంతర్జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. రఘు రాయ్ మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు రాజకీయ, సినీ మరియు కళా రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు