
ఆంధ్రప్రదేశ్-ఒడిశా, 27 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కొఠియా గ్రామాల వివాదం మరోసారి భగ్గుమంది. జనగణన సేకరణ కోసం వచ్చిన ఒడిశా అధికారుల చర్యలతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు స్థానిక గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.
వివరాల్లోకి వెళితే... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని ఎగువశెంబి గ్రామంలో ఒడిశా అధికారులు శనివారం జనగణన చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడి గిరిజనులు తాము ఆంధ్రప్రదేశ్కు చెందినవారమని, ఒడిశా అధికారులకు ఎలాంటి వివరాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నమోదు చేసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఒడిశా అధికారుల చర్యలను వ్యతిరేకించిన తాడంగి చిరంజీవి, తాడంగి పిలుకులు అనే ఇద్దరు స్థానికులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని తమ రాష్ట్రానికి తరలించారు. ఈ విషయం తెలియగానే ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో స్పందించారు.
ఒడిశా అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులోని 21 గ్రామాల్లో ఒడిశా పోలీసులు తరచూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రతి పౌరుడికి నచ్చిన చోట జీవించే హక్కు ఉందని, అమాయక గిరిజనులను బెదిరించి, అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఏపీ భూభాగంలోకి వచ్చి ఒడిశా అధికారులు పెత్తనం చేయడం, దౌర్జన్యానికి పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాజా ఘటనతో కొఠియా వివాదం మరోసారి తెరపైకి రాగా, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi