ఇంద్రకీలాద్రిపై ఫేక్ అర్చకుడి వివాదం.. నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం?
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై నకిలీ పత్రాలతో ఉద్యోగ ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి
విజయవాడ


విజయవాడ, 09 ఏప్రిల్ (హి.స.)

ఇంద్రకీలాద్రిపై మరో సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో అర్చక ఉద్యోగాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుడు దేవస్థాన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చనిపోయిన అర్చకుడి పేరును ఉపయోగించి వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలన్నయత్నం బయటపడటంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.

శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన అర్చకుడు లింగాల సాయిబాబు 2022లో మరణించారు. ఆయన స్థానంలో వారసత్వ హక్కు ఉందని పేర్కొంటూ లింగాల దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఉద్యోగానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియలో దత్తతకు సంబంధించిన పత్రాలు నకిలీవని ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యక్తి గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. 2009లో నామయ్య అనే అర్చకుడి పేరుతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో ఈ వ్యవహారం వెనుక పునరావృత ప్రయత్నాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, సంబంధిత పత్రాల ఆధారంగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పొందినట్టు ప్రచారం జరుగుతోంది. దీనితో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ విషయాన్ని తాడేపల్లికి చెందిన కోడూరు లక్ష్మీ పద్మావతి వెలుగులోకి తీసుకువచ్చారు. తన చిన్నాన్న లింగాల సాయిబాబు పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె దేవస్థాన ఈవో శీనా నాయక్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అధికారులు అప్రమత్తమై దిలీప్ కుమార్ నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బాధితురాలు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande