సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కారు. లక్షరూపాయలకు టోకరా
MLA palla


జనగామ, 09 ఏప్రిల్ (హి.స.)

కేంద్ర పథకం వికసిత్ భారత్ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. వివరాల్లోకి వెళితే.... జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ అనంత రామిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా నమ్మించడంతో ఎమ్మెల్యే సదరు వ్యక్తి మాటలను విశ్వసించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'వికసిత్ భారత్' పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నిందితుడు నమ్మించాడు. నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకు ఈ రోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు. ఒక్కో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 2,500ల చొప్పున, మొత్తం 40 మందికి కలిపి రూ. లక్ష తక్షణమే ఫోన్ పే చేయాలని కోరాడు.

ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ లక్ష రూపాయలను నిందితుడు చెప్పిన నెంబర్కు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అది నకిలీ కాల్ అని తెలియడంతో ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సైబర్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల పేర్లతో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, వెంటనే నగదు బదిలీ చేయకుండా సంబంధిత శాఖల ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande