
హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
(Ponguleti Srinivas Reddy) పై మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రవు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి రాష్ట్రానికి మంత్రిలా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ సాక్షిగా పొంగులేటి తన సహచర మంత్రుల అవినీతిని అంగీకరించారని పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను సభలో ఒప్పుకున్నారని, నాలుగు ప్రభుత్వ శాఖలు విచారణ జరిపి నివేదిక ఇచ్చినా, నోటీసులు జారీ చేసినా తనకు సంబంధం లేదనడం పొంగులేటి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. పొంగులేటి తన పొగరు తగ్గించుకోవాలని, ఆయన అక్రమాలను భవిష్యత్తులో మరిన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పేరును 'పొంగులూటీ' అని సంబోధిస్తూ హరీశ్ రావు సెటైర్లు వేశారు.
ప్రభుత్వ భూముల కబ్జాపై హరీష్ రావు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఏం చేస్తోందని నిలదీశారు. నాదరుగుల్లో ఉన్నవి ప్రభుత్వ భూములే అయితే పొంగులేటి అక్కడ బౌన్సర్లతో కాపలా పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శిల్ప, AQ వంటి సంస్థల్లో పొంగులేటి కుమారుడికి వాటా లేదా అని ఆయన నిలదీశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు