
హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించినా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఏడీబీ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రానికి సూచించిoది. మూసీ ప్రాజెక్టు వివరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు వారికి వివరించగా, పర్యావరణపరంగా ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో నిధులిచ్చేందుకు అంగీకరించింది. నదికి ఇరువైపులా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్లాన్లు రూపొందించిన ప్రభుత్వం.. వివిధ ప్రాంతాల నుంచి మూసీలోకి వచ్చి కలుస్తున్న వరద, మురుగునీటిని శుద్ధి చేయడానికి మూసీ పొడవునా ఆయా ప్రాంతాల్లో నిర్మించే ఎస్టీపీలకు పంపించనున్నారు. వీటన్నింటినీ ఏడీబీ ప్రతినిధులు పరిశీలించిన విషయం తెలిసిందే.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో హైడ్రా పాత్రపై ఏడీబీ ప్రతినిధులు ఆరా తీశారు. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. హైడ్రా మొదటి విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణతో పాటు.. రెండో విడత చేపట్టిన 14 చెరువుల గురించి ఏడీబీ ప్రతినిధులు లోతుగా చర్చించారు. చెరువులు, నాలాల ఆక్రమణలతో కలిగే వరద ముప్పును హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా ఏడీబీ ప్రతినిధులకు చూపించారు. భూగర్భ జలాల వృద్ధికి చెరువుల పునరుద్ధరణ దోహదపడుతుందన్నారు.
మూసీ పునరుజ్జీవనంలో భాగస్వామ్య శాఖలతో ఏడీబీ ప్రతినిధులు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే హైడ్రాతో సమావేశమైన ప్రతినిధులు త్వరలోనే జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖ అధికారులతోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రాజెక్టులో చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ సంప్రదింపుల తర్వాత నిధులు విడుదల చేసే అవకాశముంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..