నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఆ రెండు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Orange alert


హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణ శాఖప్రకారం.. ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతల కంటే మరో 3 డిగ్రీల సెల్సియస్ మేర వేడి పెరిగే అవకాశం ఉంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ఐఎండీ అధికారులు 'ఆరెంజ్ అలర్ట్' (Orange Alert) జారీ చేశారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగానే ఉంటుందని, అందుకే ఆ జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు (Heat waves) వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande