కుత్బుల్లా పూర్ లో భారీ అగ్నిప్రమాదం
కుద్బుల్లా పూర్ లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది
కుత్బుల్లా పూర్ లో భారీ అగ్నిప్రమాదం


హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)

కుత్బుల్లాపూర్ లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ప్లాస్టిక్, తుక్కు గోదాంలో మొదలైన మంటలు వేగంగా పక్కనే ఉన్న రెండంతస్తుల నివాస గృహానికి వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్లోని ఓ స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్, రసాయనాలు వంటివి ఉండటంతో మంటలు వేగంగా ఎగసిపడ్డాయి. గాలి ఉద్ధృతికి మంటలు పక్కనే ఉన్న ఇంటిని చుట్టుముట్టడంతో, ఇంట్లోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ఫైర్ స్టేషన్ల నుంచి నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గోదాంలోని లక్షల రూపాయల విలువైన సామగ్రి పూర్తిగా కాలి బూడిదైందని సమాచారం. ఇంటిలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జనావాసాల మధ్య గోదాంలు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande