
వాషింగ్టన్ డిసి, 09 ఏప్రిల్ (హి.స.)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి నిప్పులు చెరిగారు. రెండు వారాల తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ నిబంధనలను అతిక్రమిస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ లో ‘అమెరికాకు చెందిన అన్ని నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక బలగాలు అదనపు ఆయుధ సంపత్తితో ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటాయి. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే దాడులు తప్పవని అన్నారు. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా తుడిచిపెట్టడానికి అవసరమైన ప్రతిదీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మేము అనుకున్న నిజమైన ఒప్పందం పూర్తిగా అమలు అయ్యే వరకు మా సైన్యం వెనక్కి రాదు’ అని పోస్ట్ చేశారు.
ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, అప్పుడు మళ్లీ అసలైన ‘షూటింగ్’ మొదలవుతుందని ట్రంప్ అన్నారు. అది ఇరాన్ ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత శక్తివంతంగా, భారీగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండకూడదని, అలాగే హోర్ముజ్ జలసంధిని ఖచ్చితంగా అందరి కోసం తెరిచి ఉంచాలని ట్రంప్ అన్నారు. ప్రస్తుతానికి మా గొప్ప సైన్యం ఆయుధాలను నింపుకుంటూ, విశ్రాంతి తీసుకుంటోందని తెలిపారు. నిజానికి, తమ సైన్యం నెక్ట్స్ విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV