
ఢిల్లీ, 16 మే (హి.స.)
విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం కొత్తగా పన్ను లేదా సెస్ విధించే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న కథనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న ఆయన ఈ కథనాలను కొట్టిపారేశారు. ఆంగ్ల మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో మోదీ పోస్టు చేశారు. ప్రధాని స్పందించిన కొద్ది నిమిషాలకే సదరు మీడియా సంస్థ తన వార్తను ఉపసంహరించుకుంది. తమ నివేదికలో పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ, ఆ వార్తను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోందని ఓ ఆంగ్లమీడియా కథనం ప్రచురించింది. ఈ అంశం ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు ఆ కథనంలో పేర్కొంది. దీనిపై శుక్రవారం ఎక్స్లో స్పందించిన ప్రధాని మోదీ ఆ వార్తను పూర్తిగా తప్పుడు కథనంగా అభివర్ణించా. 'ఇది పూర్తిగా అబద్ధం. ఇందులో ఏమాత్రం నిజం లేదు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు, టాక్స్లు విధించే ప్రసక్తే లేదు. ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ను మెరుగుపర్చడానికే మేము కట్టుబడి ఉన్నాం' అని ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు.
ప్రధాని స్పందన తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ వార్త సంస్థ క్షమాపణలు తెలిపింది. ఆ కథనం సరైనది కాదని పేర్కొంటూ దానిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్లో పోస్ట్ చేసింది. 'విదేశీ ప్రయాణాలపై పన్ను, సెస్ విధించే అంశాన్ని ప్రభుత్వం ిపరిశీలిస్తోందన్న మా కథనం సరికాదు. ఆ కథనాన్ని ఉపసంహరించుకుంటున్నాం. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నాం' అని ఆ సంస్థ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi