
ఢిల్లీ:, 17 మే (హి.స.)కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. తాజాగా కిలో సీఎన్జీ ధరను రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రెండు రోజుల క్రితమే పెట్రో ధరల పెంపు సందర్బంగా సీఎన్జీ కూడా రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే సీఎన్జీ ధరను కేంద్రం రెండుసార్లు పెంచడంతో వాహనదారులు మండిపడుతున్నారు. తాజా పెంపుతో సీఎన్జీపై మొత్తంగా మూడు రూపాయాలను పెంచినట్టు అయ్యింది.
తాజాగా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.80.09కి చేరింది. ముంబైలో రూ. 84.09కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లో రూ. 88.70కి పెరిగింది. ఇక, హైదరాబాద్లో రూ.100కు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీకి చేరుకుంది. పెట్రోల్,డీజిల్తో పోలిస్తే సీఎన్జీ అధికమైలేజీతో పాటు కాలుష్య రహితం కావడంతో చాలా మంది వాహనాలను సీఎన్జీకి అనుగుణంగా ఇంధన ట్యాంకులను మార్చుకున్నారు. మరోవైపు సీఎన్జీ ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు బంకుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంధన కొరత సమస్యను పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ