ఆర్జీ కర్ హత్యాచార కేసు- విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్
ఆర్జీ కర్ హత్యాచార కేసు- విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్
CM Suvendu Adhikari


కలకత్తా, 16 మే (హి.స.)

ఆర్జీ కర్ హత్యాచార ఘటన విషయంలో సువేందు అధికారి నేతృత్వంలోని బంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హత్యాచార ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో, దర్యాప్తు చేయడంలో తీవ్రమైన పరిపాలనా లోపాలు, నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులను బంగాల్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తీవ్రమైన పరిపాలనా లోపాలు, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యం, బాధితురాలి కుటుంబానికి లంచాలు ఇవ్వజూపిన ఆరోపణలపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు బంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జైళ్లలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, ఆర్జీ కర్ ఘటన దర్యాప్తునకు సంబంధించి బంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటనలు చేశారు.

టీఎంసీ పాలనలో రక్షకులే భక్షకులుగా మారారు : సువేందు అధికారి

గత ప్రభుత్వ హయాంలో రక్షకులే భక్షకులుగా మారిన పరిస్థితి తలెత్తిందని బంగాల్ సీఎం సుభేందు అధికారి మండిపడ్డారు. పరిపాలన విభాగంలోని కొన్ని వర్గాలు నేరస్థులతో సంబంధాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఈ దుర్మార్గపు నెట్వర్క్ను అంతమొందించడానికి ప్రస్తుత బంగాల్ ప్రభుత్వం తన నిరంతర చర్యలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మహిళలు, మాతృశక్తిని ఇబ్బందులకు గురి చేసే సంఘటనల విషయంలో బంగాల్ సర్కార్ ఏమాత్రం రాజీపడదని స్పష్టం చేశారు. 'అభయ' సంఘటన యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై పారదర్శకమైన, నిష్పక్షపాతమైన విచారణ జరిగేలా చూసేందుకే ఈ పరిపాలనాపరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు బంగాల్ రాష్ట్ర సచివాలయం (నబన్నా)లో జరిగిన విలేకరుల సమావేశంలో సువేందు వ్యాఖ్యానించారు.

జైళ్లలో ఖైదీల ఫోన్ల వాడకంపై సీఎం సీరియస్

ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ (జైలు)లో మొబైల్ ఫోన్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని ఖైదీల బంధువుల నుంచి ఫిర్యాదులు అందినట్లు సీఎం సుభేందు అధికారి తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, కోల్కతా పోలీసుల సమన్వయంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని కరెక్షనల్ హోమ్స్ డీజీ ఎన్ రమేశ్ బాబును ఆదేశించారు. ఈ విషయంపై దర్యాప్తును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి అప్పగించనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో పరిపాలనా నిర్లక్ష్యం ఆరోపణలపై ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ సూపరింటెండెంట్ ఎన్. కుజూర్, చీఫ్ కంట్రోలర్ దీప్తా ఘోరాయ్లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కోల్కతా పోలీసుల సహాయంతో ప్రెసిడెన్సీ జైలులో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు కరెక్షనల్ హోమ్స్ డీజీ ఎన్ రమేశ్ బాబు తెలిపారు. పది ప్రత్యేక బృందాలు దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించగా, వివిధ రహస్య ప్రదేశాల నుంచి మొత్తం 23 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఈ ఫోన్లు జైలులోకి ఎలా ప్రవేశించాయి? వాటిని ఎవరు వాడుతున్నారు? ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారు? అనే విషయాలను నిర్ధారించడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు.

2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ కేసుకు సంబంధించి ఆస్పత్రిలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం సంజయ్ రాయ్ని దోషిగా లేల్చింది. ఈ క్రమంలో అతడికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande