
విశాఖపట్నం (గాజువాక), , 17 మే (హి.స.)
:మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు )కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు. ఈరోజు (ఆదివారం) విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచనతో, సీఎం చంద్రబాబు ఏకీభవిస్తూ మహానాడును రద్దు చేశారని వెల్లడించారు. కోవిడ్ లాంటి సమయంలో వర్చువల్ మహానాడును ఏర్పాటు చేశామని ప్రస్తావించారు.
ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చుతో కూడుకున్న విషయమని, అలాగే దాదాపుగా పదివేల వాహనాలు మహానాడుకు చేరుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇంధన వనరులు ఆదా చేసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో హైబ్రిడ్ మోడల్ మహానాడు నిర్వహిస్తామని వివరించారు. 1848 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ప్రాంగణంలో పార్టీకి చెందిన 68 మంది సీనియర్ నేతలతో కూడిన బృందం మహానాడు సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ