పాత ఛార్జీలతో నడపలేం.. అడ్వాన్స్ బుకింగ్స్ సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ లైన్స్
పాత ఛార్జీలతో నడపలేం.. అడ్వాన్స్ బుకింగ్స్ సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ లైన్స్
Aeroplane


హైదరాబాద్, 17 మే (హి.స.)

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు (ఎయిర్లైన్స్) ఝలక్ ఇచ్చాయి. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు భారీ సంఖ్యలో క్యాన్సిలేషన్ మెసేజ్లు పంపుతుండటం ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేస్తోంది. దాదాపు 95 శాతం ముందస్తు బుకింగ్లకు సంబంధించి క్యాన్సిల్ సందేశాలు వస్తున్నాయి. సాధారణంగా నెలల ముందే ప్లాన్ చేసుకునే విదేశీ ప్రయాణాలకు, ఎయిర్లైన్స్ చివరి నిమిషంలో షాక్ ఇస్తున్నాయి. ప్రయాణానికి కేవలం 4 నుంచి 5 రోజుల ముందు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశమైన షార్జా (Sharjah) మీదుగా అమెరికా (USA), యూరప్ (Europe) దేశాలకు వెళ్లాల్సిన కనెక్టింగ్ విమాన సర్వీసులను భారీగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.

గ్లోబల్ మార్కెట్లో విమాన ఇంధన ధరల పెరుగుదల, అంతర్జాతీయ విమాన మార్గాల మార్పుల (Rerouting) వల్ల ఆపరేషనల్ ఖర్చులు భారీగా పెరిగాయని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. గతంలో ప్రయాణికులు బుక్ చేసుకున్న పాత ఛార్జీల (టికెట్ ధరల)తో ప్రస్తుత పరిస్థితుల్లో విమానాలు నడపడం సాధ్యం కాదంటూ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ హఠాత్ పరిణామంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన విమానాశ్రయాలైన మంది హైదరాబాద్ (శంషాబాద్), విశాఖపట్నం, గన్నవరం (విజయవాడ)తో పాటు పొరుగు రాష్ట్రమైన చెన్నై నుంచి విదేశాలకు వెళ్లాల్సిన వేలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో విమానాలు రద్దు కావడంతో ఏం చేయాలో పాలుపోక, ప్రత్యామ్నాయ మార్గాలు లేక లబోదిబోమంటున్నారు. మరోవైపు అత్యవసరంగా వెళ్లాల్సిన వారు వేరే విమానాల్లో ప్రస్తుతమున్న భారీ ధరలకు కొత్తగా టికెట్లు కొనుగోలు చేయలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. విమానయాన సంస్థల ఈ ఏకపక్ష నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande