గోవుల తరలింపు.. మెహదీపట్నంలో ఉద్రిక్తత..
గోవుల తరలింపు.. మెహదీపట్నంలో ఉద్రిక్తత..
Hi tension


హైదరాబాద్, 17 మే (హి.స.) నగరంలోని కీలక ప్రాంతమైన

మెహదీపట్నంలో శనివారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గోవుల తరలింపు వ్యవహారం కాస్తా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. నగరంలోకి గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు మెహదీపట్నం ప్రధాన రహదారిపై ఒక లారీని అడ్డుకున్నారు. అయితే ఆ లారీని అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో వర్గానికి చెందిన యువకులు అక్కడికి భారీగా చేరుకున్నారు. లారీని వదిలిపెట్టాలంటూ వారు డిమాండ్ చేయడంతో ఇరు వర్గాల మధ్య మొదట తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా క్షణాల్లోనే ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

నడిరోడ్డుపైనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో మెహదీపట్నం జంక్షన్ రణరంగంగా మారింది. ఈ ఊహించని పరిణామంతో వాహనదారులు, స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతో రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రోడ్డుపై పరుగులు తీస్తూ అల్లరి మూకలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లోగా విషయం తెలుసుకున్న నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తన అనుచరులతో కలిసి స్పాట్కు చేరుకున్నారు. అర్ధరాత్రి రోడ్డుపై లారీని అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీని ఎందుకు ఆపారంటూ పోలీసులను నిలదీశారు. నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ నేరుగా గోవులు తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చిన లారీపైకి ఎక్కారు. లారీ క్యాబిన్లో కూర్చుని ప్రయాణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande