
న్యూఢిల్లీ, 18 మే (హి.స.) బీసీసీఐకి కేంద్ర సమాచార కమిషన్
'బిగ్ రిలీఫ్' ఇచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి (BCCI) కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఒక కీలక తీర్పు ద్వారా భారీ ఊరటనిచ్చింది. బీసీసీఐ సమాచార హక్కు చట్టం (RTI)-2005 పరిధిలోకి రాదని సీఐసీ స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం.. బీసీసీఐ ఒక 'పబ్లిక్ అథారిటీ' (ప్రభుత్వ సంస్థ) కిందకు రాదని, ఇది పూర్తిగా ఒక స్వతంత్ర సంస్థ అని కమిషన్ తేల్చిచెప్పింది. దీనికి ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హోదా లేదని CIC వివరించింది.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.. బీసీసీఐ తన రోజువారీ కార్యకలాపాలకు, మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక నిధులు (Government Funding) లేదా గ్రాంట్లు తీసుకోవడం లేదు. సొంత నిధులు, ప్రైవేట్ స్పాన్సర్షిప్లతో నడిచే రిజిస్టర్డ్ సొసైటీ అయినందున.. ఆర్టీఐ కింద పౌరులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం బీసీసీఐకి లేదని సీఐసీ స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో క్రికెట్ బోర్డు అంతర్గత విషయాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలకు, వివాదాలకు పూర్తిగా బ్రేక్ పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..