
న్యూఢిల్లీ, 18 మే (హి.స.)
ఉమర్ ఖలీద్ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం 'ఉపా' (UAPA) కింద నమోదైన కేసులలో బెయిల్ మంజూరుకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు టెర్రర్ ఫండింగ్ కేసులో సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ, జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కఠినమైన ఉపా కేసుల్లోనైనా 'బెయిల్ అనేది నియమం.. జైలు అనేది మినహాయింపు ' (Bail is the rule, jail is the exception) అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుడిపై యాంటీ-టెర్రర్ చట్టం ఉన్నంత మాత్రాన... రాజ్యాంగం కల్పించిన 'త్వరితగతిన విచారణ' (Right to a Speedy Trial) పొందే ప్రాథమిక హక్కును కాలరాయలేరని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో, 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు గత జనవరిలో సుప్రీంకోర్టులోని మరొక ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ బెయిల్ నిరాకరించిన తీర్పుపై జస్టిస్ నాగరత్న ధర్మాసనం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉపా కేసుల్లో విచారణలో సుదీర్ఘ ఆలస్యం (Long delay in trial) జరిగితే దాన్ని బెయిల్ ఇచ్చేందుకు ప్రాతిపదికగా తీసుకోవచ్చని గతంలో ముగ్గురు న్యాయమూర్తుల (3-Judge Bench) ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని.. కానీ, జనవరి నాటి ఇద్దరు జడ్జీల బెంచ్ ఆ తీర్పును సరిగ్గా అనుసరించకుండా నిబంధనల నుంచి విరుద్ధంగా (Deviated) వ్యవహరించిందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..