చిత్తూరులో ఘరానా మోసం.. దొంగల ముఠాతో చేతులు కలిపిన పోలీసులు
చిత్తూరు,18 మే (హి.స.) రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలిపి బాధితుడిని నిలువునా దోచుకున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) పరిధిలో జరిగిన ఒక ఘరానా మోసంలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్సై, ఏఆర్ హెడ్ కానిస్ట
police


చిత్తూరు,18 మే (హి.స.) రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలిపి బాధితుడిని నిలువునా దోచుకున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) పరిధిలో జరిగిన ఒక ఘరానా మోసంలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్సై, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషించడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. దొంగల ముఠాతో కలిసి ఓ వ్యక్తి నుంచి ఏకంగా పది లక్షల రూపాయలు కాజేసిన వ్యవహారంలో నిందితులైన పోలీసులను ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... చిత్తూరు ట్రాఫిక్ విభాగంలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రవిచంద్రన్ ఒక దొంగల ముఠాతో చేతులు కలిపారు. పక్కా స్కెచ్ ప్రకారం.. బాధితుడిని ట్రాప్ చేసి, బెదిరింపులకు గురిచేసి అతని వద్ద నుంచి రూ. 10 లక్షల నగదును లాక్కున్నారు. బాధితుడు ధైర్యం చేసి ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ ఖాకీల అసలు రంగు బయటపడింది. అయితే, ఈ దోపిడీ వెనుక ఉన్న అసలు దందా ఏంటనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సదరు ముఠాతో పోలీసులు చేతులు కలిపింది 'టెంకాయల వ్యాపారం' పేరిట మోసం చేయడానికా? లేక 'దొంగ నోట్ల చలామణి' వ్యాపారంలో భాగస్వామ్యులై ఈ దోపిడీకి పాల్పడ్డారా? అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడిని ముంచిన ట్రాఫిక్ ఏఎస్సై లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ రవిచంద్రన్లతో పాటు ఈ దోపిడీ ముఠాలోని ఇతర సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande