
తిరుమల, 18 మే (హి.స.) తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ సోమవారం ఉదయం 10.00 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటల లోపు నగదు చెల్లించిన వారికి టికెట్లు మంజూరు అవుతాయని టీటీడీ పేర్కొంది.
మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లు ఆన్ లైన్లో విడుదల చేయనుంది. అలాగే వార్షిక పవిత్రోత్సవాలకు సంబంధించిన టికెట్లు కూడా అదే సమయంలో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
మే 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, ఉదయం 11.00 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం కేటాయించిన ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SSD) టికెట్ల కోటా.. అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుమల, తిరుపతిలలో భక్తుల వసతి కోసం గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులకు ఈ సందర్భంగా వారు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV