22 నిమిషాల్లోనే అత్యంత కచ్చితత్వంతో పాక్పై దాడులు: భారత ఆర్మీ చీఫ్
22 నిమిషాల్లోనే అత్యంత కచ్చితత్వంతో పాక్పై దాడులు: భారత ఆర్మీ చీఫ్
22 నిమిషాల్లోనే అత్యంత కచ్చితత్వంతో పాక్పై దాడులు: భారత ఆర్మీ చీఫ్


న్యూఢిల్లీ, 19 మే (హి.స.)

ఆపరేషన్ సిందూర్లో భాగంగా 2025 మే 6, 7 తేదీల మధ్య రాత్రి కేవలం 22 నిమిషాల్లోనే అత్యంత కచ్చితత్వంతో పాక్పై దాడులు చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఆనాడు (12 నెలల క్రితం) సైనికపరమైన కచ్చితత్వం, సమాచార నియంత్రణ, దౌత్య సంకేతాలు, ఆర్థిక సంకల్పాలను కలగలిపి 'స్మార్ట్ పవర్' అనే ప్రశ్నకు భారత్, ప్రపంచానికి పాక్షిక సమాధానాన్ని ఇచ్చిందన్నారు. భారత్ దృష్టిలో స్మార్ట్ పవర్ అంటే దేశ రక్షణ, అభివృద్ధి, ప్రపంచ దేశాల మధ్య మన ప్రభావాన్ని పెంచుకోవడానికి సైనిక, ఆర్థిక బలాలను తెలివిగా, వ్యూహాత్మకంగా ఉపయోగించడమే అని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం దిల్లీలోని రక్షణ రంగ అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్లో 'భద్రత నుంచి శ్రేయస్సుకు: సుస్థిర జాతీయ వృద్ధికి స్మార్ట్ పవర్' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో భారత ఆర్మీ చీఫ్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఒక సాధారణ సైనిక చర్య కాదని, అది భారతదేశపు సమగ్ర జాతీయ శక్తికి నిదర్శనమన్నారు. అది పాకిస్థాన్ను దారుణంగా దెబ్బతీసిందని, ఆ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ సైనికపరమైన కచ్చితత్వాన్ని ప్రదర్శించిందని చెప్పారు. ఈ సైనిక చర్య భారత సేనల వ్యూహాత్మక పట్టుదలకు నిదర్శనమన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ను అద్భుతంగా అమలు చేసినందుకు భారత సాయుధ దళాలను ఆయన అభినందించారు.

ఉద్దేశపూర్వకంగానే ఆపరేషన్ సిందూర్ను ఆపేశాం

ఆపరేషన్ సిందూర్ అనేది దీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయ వ్యూహాత్మక భావనను ఛేదించింది. సైనిక చర్యను పూర్తిచేశాక, అది ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగానే ఆగిపోయింది. 88 గంటల సైనిక చర్య అనంతరం ఉద్దేశపూర్వకంగా ఆపరేషన్ సిందూర్ను నిలిపివేయడం అనేది, సైనిక కదలికను వ్యూహాత్మక చర్యగా ఎప్పుడు మార్చాలో కచ్చితత్వంతో తెలిసిన భారత సేనల చాకచక్యానికి సంపూర్ణ నిదర్శనం అని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.

వనరుల కోసం పవర్ పాలిటిక్స్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపద, వ్యాపారాలు, వనరులపై పట్టు కోసం కొన్ని దేశాలు పవర్ (సైనిక శక్తితో) పాలిటిక్స్ చేస్తున్నాయి. ఈ అంశమే పలు ప్రపంచ దేశాల మధ్య అవిశ్వాసాన్ని పెంచుతోంది. అశాంతికి కారణమవుతోంది. కూటముల మధ్య వైరుధ్యాలను క్రియేట్ చేస్తోంది. నేడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు మరింత సంక్లిష్టమైన సంకేతాలను పంపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు పెరిగి, దేశాలన్నీ సంపన్నవంతంగా మారితే యుద్ధాలు, గొడవలు రావని గతంలో చెప్పారు. కానీ, నేడు ఆ నమ్మకం అబద్ధమైంది. ఇప్పుడు దేశాలు శాంతిగా ఉండాల్సింది పోయి తమ సైనిక, రాజకీయ బలంతో ఎదుటి దేశాల సంపదను, వ్యాపారాలను లాక్కోవడానికి యత్నిస్తున్నాయి అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande