21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు - భక్తుల కోసం 3 వేలకు పైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు - భక్తుల కోసం 3 వేలకు పైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు - భక్తుల కోసం 3 వేలకు పైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


హైదరాబాద్, 19 మే (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ స్థలమైన కాళేశ్వరంలో జరిగే పుష్కరాలకు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.

మొత్తం 3,360 బస్సులు : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో 5,772 ప్రత్యేక ట్రిప్పులను నడిపేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంతంలోని హనుమకొండ, వరంగల్-1, వరంగల్-2, పరకాల, నర్సంపేట, జనగామ, భూపాలపల్లి, తొర్రూరు, మహబూబాబాద్ డిపోల నుంచి కాళేశ్వరానికి 59 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.

సీఎం, డీప్యూటీ సీఎంకు ఆహ్వానం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21న ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆహ్వానించారు.

30-40 లక్షల మంది హాజరయ్యే అవకాశం : కాళేశ్వరం పుష్కారలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. పుష్కారాలకు సంబంధించి ఏర్పాట్లపై సీఎస్ కె.రామకృష్ణా రావు ఆధ్వర్యంలో సచివాలయంలో ఇటీవల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ నెల 21న ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి పుణ్యస్నానం ఆచరించి అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈసారి పుష్కరాలకు దాదాపు 30-40 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

భక్తుల కోసం మౌలిక సౌకర్యాలు ఏర్పాటు : దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారని పేర్కొన్నారు. ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఇవన్నీ జూన్ 1న ముగియనున్న పుష్కరాలకు విస్తృతమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేశామని సీఎస్ పేర్కొన్నారు. ఈ పుష్కరాల్లో భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, శానిటేషన్, ట్రాఫిక్, రవాణాను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, డైరెక్టర్ హనుమంతరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నవీన్ మిత్తల్, ముకుంద్రెడ్డి, అనితా రామచంద్రన్, హారీశ్, చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు.

పుష్కరాల్లో భక్తుల ఆరోగ్యమస్తు! : అంతేకాకుండా కాళేశ్వరం త్రివేణి సంగం పుష్కరాల్లో భక్తులకు సేవలు అందించేందుకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ 12 రోజుల పాటు సాగే ఈ మహా వేడుకలను లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కొత్త కార్యచరణ చేసింది. అక్కడికి వచ్చిన వారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 16 వైద్య శిబిరాలు, 576 మంది సుశిక్షితులైన సిబ్బంది, 18 మంది ప్రత్యేక వైద్య నిపుణులను రంగంలోని దింపనుంది. మొత్తం 16 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ ప్రధాన క్యాంప్, కాళేశ్వరం పీహెచ్సీ ప్రధాన క్యాంప్, పాత ఈవో కార్యాలయం, దేవాలయ ప్రధాన ద్వారం, పార్కింగ్ ఏరియా-1, టెంట్ సిటీ, పార్కింగ్ ఏరియా-2, తాత్కాలిక బస్టాండ్, పాత బస్టాండ్, గోదావరి ప్రధాన ఘాట్, హరిత హోటల్, సరస్వతీ ఘాట్ నదీ తీరం, గంగారపు క్రాస్ రోడ్, అన్నారం కెనాల్, కాటారం పీహెచ్సీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పారామెడికల్ సిబ్బందికి బస, మందుల భద్రతకు స్టోరేజ్ గదులు కేటాయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande