ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం
ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం
municipal-corporation-sanitation-workers-protest-essential-commodities


అనంతపురం, 19 మే (హి.స.)అనంతపురం నగరపాలక సంస్థలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యవసర ధరలపై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు నిత్యవసరాల ధరల పెంపుపై రోడ్డెక్కారు. ఇప్పటికే చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం తమకు గుదిబండగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెల్లవారుజామునే మాస్టర్ పాయింట్కు చేరుకోవడానికి దూరాభారాల వల్ల ఐదు నిమిషాలు ఆలస్యమైతే, శానిటరీ ఎస్ఐలు 'ఆబ్సెంట్' వేస్తూ జీతాలు కోత విధిస్తున్నారని కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గం. కరోనా వంటి విపత్కర కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన మాపై ఈరోజు ధరల భారం వేసి అర్ధాకలితో అలమటించేలా చేస్తున్నారు.

రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజల, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రజా సంపదను అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలను తగ్గించకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande