
తాండూరు, 20 మే (హి.స.)
తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో పోలీసులు బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 50 మందికి పైగా పోలీసు సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని, కాలం చెల్లిన వాహనాలను పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా 31 బైకులు, 5 ఆటోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో భరోసా కలిపించుటకు ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ జంట మహిళల హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇందిరమ్మ కాలనీకి చెందిన వ్యక్తి కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి, వారికి ధైర్యం కల్పించేందుకే ఈ కార్డెన్ సెర్చ్ చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. కాలనీలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కాలనీలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు